పీడీపీని ముక్కలు చేస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..

SMTV Desk 2018-07-13 12:15:26  pdp leader mehabooba mufti, mehabooba mufti fires on bjp, pdp vs bjp, jammu kashmir

ఢిల్లీ, జూలై 13 : పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ)ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ పార్టీ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పరోక్షంగా భాజపాను హెచ్చరించారు. పీడీపీకి భాజపా మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్ముకశ్మీర్‌లో ముఫ్తీ ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో గవర్నర్‌ పాలన నడుస్తోంది. అయితే పలువురు పీడీపీ నేతలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఫ్తీ పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం భాజపా, పీడీపీల పొత్తు ముగిసిన వెంటనే కూడా ముఫ్తీ ఇదే విషయాన్ని గట్టిగా చెప్పారు. తమ పార్టీలో చీలిక తెచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తే కశ్మీర్‌ ప్రజలకు భారత ప్రజాస్వామ్యంపైనే నమ్మకం పోతుందని ఆమె హెచ్చరించారు. తాజాగా మరోసారి అదే విధమైన హెచ్చరికలు చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పీడీపీ విఫలమయ్యిందని ఆరోపిస్తూ బీజేపీ మద్దతు ఉపసంహరించుకొంది. పీడీపీ-భాజపా సంకీర్ణ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌ను మూడేళ్ల పాటు పాలించింది. ఈ ఏడాది జూన్‌లో కాషాయదళం మద్దతు ఉపసహరించుకోవడంతో ముఫ్తీ సీఎం పదవికి రాజీనామా చేశారు.