టికెట్ బుక్ చేసిన స్వామి పరిపూర్ణానంద.. రంగంలోకి పోలీసులు..

SMTV Desk 2018-07-12 14:13:34  Swami Paripoornananda, spiritual leader swami paripoornananda, Hyderabad, kathi mahesh

హైదరాబాద్‌, జూలై 12 : శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందపై హైదరాబాద్‌ పోలీసులు ఆరు నెలలు నగర బహిష్కరణ విధించిన విషయం తెలిసిందే. కాగా ఆయన మళ్లీ హైదరాబాద్‌ వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గురువారం ఆయన మళ్లీ హైదరాబాద్‌ వచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఆయన టికెట్‌ రిజర్వ్‌ చేసుకున్నారు. తనపై బహిష్కరణ హైదరాబాద్‌ పరిధి వరకే పరిమితం కావడంతో సైబరాబాద్‌ పరిధిలో ఉండేందుకు ఆయన హైదరాబాద్‌ వస్తున్నట్టు తెలిసిందే. ఈ విషయమై సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలోనూ స్వామి పరిపూర్ణానందపై ఆరు నెలల బహిష్కరణ విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసి.. వాటిని పరిపూర్ణానందకు అందజేసేందుకు కాకినాడ బయలుదేరినట్టు తెలుస్తోంది. శ్రీరాముడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా చేశారంటూ కత్తి మహేశ్‌పై పోలీసులు ఆర్నెల్ల పాటు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. అయితే కత్తి మహేశ్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ చౌటుప్పల్‌ నుంచి యాదాద్రి వరకు స్వామి పరిపూర్ణానంద చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పాటు ఆయన్ని గృహ నిర్బంధం చేశారు. రెండ్రోజుల నుంచి ఆయన బయటకు రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. తర్వాత స్వామి పరిపూర్ణానందను కూడా నగర బహిష్కరణ చేశారు. పోలీసుల చర్యను హిందూ ధార్మిక సంఘాలతో పాటు బీజేపీ తీవ్రంగా ఖండించింది.