కాపాడండి..లేదా.. కూల్చేయండి..

SMTV Desk 2018-07-11 17:24:41  Supreme Court Slams, supreme court fires on tajmahal, up government, delhi

ఢిల్లీ, జూలై 11: కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు తాజ్‌ మహల్‌ బాగోగులను పట్టించుకుంటాయన్న ఆశ లేదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ పట్ల ప్రభుత్వ ధోరణి సరిగా లేదని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ చారిత్రక కట్టడాన్ని కాపాడలేకపోతే.. కూల్చేయండని పేర్కొంది. తాజ్‌ నిర్వహణపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం బుధవారం విచారించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ...‘తాజ్‌మహల్‌ను కూల్చేస్తారా? లేక మీరు పరిరక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారా? లేదా తాజ్‌ను మూసేయమంటరా?’ అని కేంద్రాన్ని ఘాటుగా ప్రశ్నించింది. జస్టిస్‌ లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ‘టీవీ టవర్‌గా పిలిచే లండన్‌లోని ఈఫిల్‌ టవర్‌ సందర్శనార్థం ఏటా 80లక్షలమంది సందర్శకులు అక్కడికి వస్తుంటారని, తాజ్‌మహల్‌...దానికంటే అందమైందని అభిప్రాయపడింది. తాజ్‌ మీద దృష్టి పెట్టడం వల్ల విదేశీ మారకద్రవ్య సమస్య సులభంగా తీరిపోతుందని తెలిపింది. తాజ్‌ మహల్‌ రంగు మారిపోతోందంటూ..దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది మేలో సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకూ దీనిపై తీసుకున్న చర్యల తాలూకు నివేదికలను సమర్పించాల్సిందిగా కేంద్రానికి సూచించింది. దీనిపై కేంద్రం తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. తాజ్‌ మహల్‌పై పరిశోధించడానికి, నష్టశాతాన్ని అంచనా వేయడానికి ఇప్పటికే ప్రత్యేక కమిటీని నియమించామని పేర్కొన్నారు. నాలుగు నెలల్లో నివేదిక సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా తాజ్‌ పై అధ్యయనం చేయడానికి కాన్పూర్‌ విశ్వవిద్యాలయ నిపుణుల సాయం కూడా తీసుకున్నామని న్యాయవాది తెలిపారు.