రాజకీయాల్లోకి మాజీ సీఎం వారసుడు..!

SMTV Desk 2018-07-11 12:57:18  Riteish Deshmukh, Riteish Deshmukh contest 2019 elections, bollywood, 2019 elections

ముంబై, జూలై 11 : బాలీవుడ్ ప్రముఖ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారని సమాచారం. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌ రావ్‌ దేశ్‌ముఖ్‌ కుమారుడైన రితేశ్‌..2019 లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన తండ్రి స్వస్థలమైన మహారాష్ట్రలోని లాతూరు నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 2016లో రాజకీయాల గురించి రితేశ్‌ మాట్లాడుతూ.. తన తండ్రిలా తాను రాజకీయాల్లోకి రాలేనని వెల్లడించారు. అయితే లోక్‌ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయాల్లోకి రావడానికి ఇదే మంచి తరుణం అని భావించారట. 1999 నుంచి 2008 వరకు విలాస్‌రావ్‌ రెండు సార్లు మహారాష్ట్ర ముఖ‌్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కిడ్నీ, కాలేయ సమస్యతో బాధపడుతూ విలాస్‌రావ్‌ 2012 ఆగస్ట్‌లో మరణించారు. అదే ఏడాదిలో రితేశ్‌..నటి జెనీలియాను వివాహం చేసుకున్నారు. అయితే తన రాజకీయ రంగప్రవేశంపై రితేశ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం రితేశ్‌ ‘టోటల్‌ ధమాల్‌’, ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రాల్లో బీజీగా ఉన్నారు.