అప్పుడు కత్తి.. ఇప్పుడు స్వామి పరిపూర్ణానంద..

SMTV Desk 2018-07-11 11:05:51   Swami Paripoornananda, spiritual leader swamiparipoornananda, kathi mahesh, hyderabad

హైదరాబాద్‌, జూలై 11: శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందపై హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. శ్రీరాముడిపై కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించిన విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో జూబ్లీహిల్స్‌ గృహ నిర్బంధంలో ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాకినాడ తరలించారు. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా నగరంలో ప్రవేశించొద్దని.. తమ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు సందర్భాల్లో ఇతర మతాలపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. స్వామి పరిపూర్ణాంద తరలింపులో తొలుత పోలీసులు చాకచక్యం ప్రదర్శించారు. నాలుగు వాహనాల్లో బయలు దేరిన పోలీసులు రెండు వాహనాలను విజయవాడ వైపు, మరో రెండు వాహనాలను శ్రీశైలం వైపు పంపించారు. ఈ రెండు మార్గాల్లో ఆయన్ను ఎక్కడికి తరలించారనే విషయాన్నిపోలీసులు వెల్లడించలేదు. అధికారిక ప్రకటన అనంతరం కాకినాడలోని శ్రీపీఠానికి స్వామి పరిపూర్ణానందను తరలించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీరాముడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా చేశారంటూ కత్తి మహేశ్‌పై పోలీసులు ఆర్నెల్ల పాటు నగర బహిష్కరణ విధించిన విషయం తెలిసిందే. అయితే కత్తి మహేశ్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ చౌటుప్పల్‌ నుంచి యాదాద్రి వరకు స్వామి పరిపూర్ణానంద చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పాటు ఆయన్ని గృహ నిర్బంధం చేశారు. రెండ్రోజుల నుంచి ఆయన బయటకు రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసుల చర్యను హిందూ ధార్మిక సంఘాలతో పాటు బీజేపీ తీవ్రంగా ఖండించింది.