నీట్- 2018 : సీబీఎస్‌ఈకి మద్రాసు హైకోర్టు ఆదేశాలు..

SMTV Desk 2018-07-10 14:29:46  neet exam-2018, tamilandu neet exam, madras high court, cbse

తమిళనాడు, జూలై 10 : వైద్య విద్య అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) తమిళంలో రాసిన అభ్యర్ధులకు అదనపు మార్కులు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు సీబీఎస్‌ఈని ఆదేశించింది. నీట్‌ తమిళ ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లినందుకు వల్ల ఈ గ్రేస్‌ మార్కులు కలపాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళ భాషలో పరీక్ష రాసిన విద్యార్థులకు గ్రేస్‌ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మధురై బెంచ్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌సీ)ను ఆదేశించింది. మార్కులు కలిపిన తర్వాత మళ్లీ ర్యాంకుల జాబితాను విడుదల చేయాలని సూచించింది. అప్పటి వరకు మెడికల్‌ కోర్సు కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఇటీవల నీట్‌ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలో తమిళ భాషలో ఇచ్చిన ప్రశ్నాపత్నంలో 49 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయని సీపీఎం నేత టీకే రంగరాజన్‌ మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఆంగ్లం నుంచి తమిళంలోకి అనువాదం చేసిన సమయంలో ఈ తప్పులు వచ్చినట్లు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. నీట్‌ పరీక్షకు సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ పెండింగ్‌లో ఉండగానే ర్యాంకు లిస్టు ఎలా విడుదల చేస్తారని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.