జపాన్‌లో వరద బీభత్సం.. 100 మందికి పైగా మృతి..

SMTV Desk 2018-07-09 17:08:31  japan heavy rains, japan floods, Shinzo Abe, japan

జపాన్, జూలై 9 : జపాన్‌ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే 100 మందికి పైగా మృతి చెందారు. మరో 70 మంది వరకు గల్లంతయ్యారు. పశ్చిమ జపాన్‌లోని చాలా ప్రాంతాల్లో గురువారం (జులై 5) నుంచే కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. జులైలో కురిసే సాధారణ వర్షపాతం కంటే మూడు రెట్లు అధికంగా వానలు కురిశాయి. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో ఉన్న లక్షలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరణించిన వారి మృతదేహాలు, గల్లంతైనవారి కోసం సహాయ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. భారీ వరదల కారణంగా జపాన్ ఉత్తర ప్రాంతంలో కొండచరియలు విరిగిపడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. సోమవారం నుంచి జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో 250 మిల్లీమీటర్లకు పైగా వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.‘ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. సహాయక బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి’ అని జపాన్ ప్రధాని షింజో అబే తెలిపారు.