నిర్భయ నిందితులకు ఉరి సరే..

SMTV Desk 2018-07-09 14:42:51  #nirbhayacaseverdict, nirbhaya case verdict, death sentence to nirbhaya incident, supreme court, delhi

ఢిల్లీ, జూలై 9 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనకు చెందిన నాలుగురు నిందితులకు సుప్రీం కోర్టు ఉరి శిక్షను ఖరారు చేసింది. ఢిల్లీ హైకోర్టు సహా కింది కోర్టుల తీర్పును సమర్ధించిన ధర్మాసనం ఉరి శిక్షను ఖరారు చేసింది. దోషులు క్షమించరాని నేరం చేశారని.. ఈ కేసులో రివ్యూ పిటిషన్ కు తావులేదని సుప్రీం కోర్టు వెల్లడించింది. నిందితులకు ట్రయల్‌ కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసిన మరణ శిక్షలను గతేడాది మేలో సుప్రీం కోర్టు ఖరారు చేసింది. సుప్రీం తీర్పును సమీక్షించాలని కోరుతూ దోషులు ముఖేష్‌(29), పవన్‌ గుప్తా(22), వినయ్‌ శర్మ(23) అక్షయ్‌ కుమార్‌ సింగ్‌(31) కూడా దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు భానుమతి, అశోక్‌ భూషణ్‌ల ఆధర్వ్యంలో ధర్మాసనం విచారణ చేపట్టి, తీర్పును వెల్లడించింది. ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. అయితే క్యురెటివ్‌ పిటిషన్‌ వేసేందుకు మాత్రం వారికి అవకాశం కల్పించింది. 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై ఆరుగురు లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఆమెను, ఆమె స్నేహితుడిని నగ్నంగా రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు యువతి ప్రాణాలు కోల్పోయింది. కేసులో ఆరుగురు నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు (అతనిపై నిఘా కొనసాగుతుంది).