ఎదురులేని భారత్..

SMTV Desk 2018-07-09 11:28:05  india vs england, rohith sharma, india tour of england, hardik pandya

బ్రిస్టల్‌, జూలై 9 : ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత్ జట్టు తొలి అడుగు ఘనంగా ఆరంభించింది. మూడు టీ-20 ల సిరీస్ లో భాగంగా బ్రిస్టల్ వేదికగా జరిగిన చివరి నిర్ణయాత్మక టి20లో భారత్‌ 7 వికెట్లతో తేడాతో జయభేరి మోగించింది. దీంతో సిరీస్ ను 2-1 తో కోహ్లిసేన కైవసం చేసుకుంది. తొలుత ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. జేసన్‌ రాయ్‌ (31 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), బట్లర్‌ (21 బంతుల్లో 34; 7 ఫోర్లు) ధాటిగా ఆడారు. అనంతరం రోహిత్‌ శర్మ (100 నాటౌట్‌; 56 బంతుల్లో 11×4, 5×6) సెంచరీతో చెలరేగడంతో భారత్‌ అలవోకగా నెగ్గింది. దీంతో టీమిండియా 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగులు సాధించింది. మొదట విధ్వంసక ఆరంభంతో ఇంగ్లాండ్‌ భయపెట్టినా.. బౌలర్లు పుంజుకుని మ్యాచ్‌ను భారత్‌ చేతుల్లోకి తెచ్చారు. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీయగా, సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లు దక్కించుకొన్నాడు. భారీ లక్ష్య చేధనకు దిగిన టీమిండియా జట్టులో మూడో ఓవర్లోనే ధావన్‌ (5), ఆరో ఓవర్లోనే రాహుల్‌ (19) ఔటైపోయినా రోహిత్‌ మాత్రం తగ్గలేదు. తర్వాత వచ్చిన కోహ్లి(43) నుంచి రోహిత్‌కు చక్కటి సహకారం లభించింది. చివరిలో కోహ్లి ఔటైన రోహిత్-పాండ్యా జోడి భారత్ ను విజయతీరాలకు చేర్చింది. 19 ఓవర్లో జోర్డాన్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి రోహిత్‌ 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా... భారీ సిక్స్‌తో పాండ్యా గెలిపించాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ రెండు రోహిత్ శర్మకు దక్కాయి. ఇక గురువారం నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సమరానికి తెర లేవనుంది.