అన్నీ సౌరశక్తి తోనే...

SMTV Desk 2017-07-15 12:51:23  TRAIN, RAILWAY MINISTER, INNOGIRATION, SOLAR SYSTEM, RAIL SAARADHI, LIGHTS, FANS.

న్యూఢిల్లీ, జూలై 15 : ఢిల్లీ లోని సఫ్దర్ జంగ్ రైల్వేస్టేషన్‌లో సౌరశక్తిని ఉపయోగించుకుని నడిచే తొలి డీఈఎమ్‌యూ (డీజిల్‌, ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యునిట్‌) రైలును భారతీయ రైల్వే ఆవిష్కరించగా, రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలులోని విద్యుద్దీపాలు, ఫ్యాన్లు, సమాచార ప్రదర్శక వ్యవస్థలకు అవసరమైన మొత్తం విద్యుత్‌, సౌరశక్తి ద్వారానే అందనుంది. దీని కోసం బోగీల పైభాగంలో సౌరఫలకాలను అమర్చారు. ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారుచేయగా.. భారతీయ రైల్వే ప్రత్యామ్నాయ వనరుల సంస్థ (ఐఆర్‌ఓఏఎఫ్‌) సౌరఫలకాలను రూపొందించింది. మరో ఆరు నెలల్లో 24 బోగీలను తయారు చేయనున్నారు. డీజిల్‌ వ్యయం రూ.12 లక్షలు తగ్గడంతో పాటు... ఏడాదికి ఒక్కో బోగీ ద్వారా ఉద్గారమయ్యే కర్బన కాలుష్యాలు 9 టన్నుల వరకు తగ్గనున్నాయి. బహుళ రైల్వే సేవలను ఒకేచోట పొందేందుకు వీలుగా రైల్వేశాఖ ‘రైల్‌ సారథి’ అనే సరికొత్త యాప్‌ను ఆవిష్కరించడమే గాక 3ఏసీ బోగీల్లో దివ్యాంగుల కోసం ఒక లోయర్‌ బెర్తు, వారికి తోడుగా ఉండేవారి కోసం మిడిల్‌ బెర్తు రిజర్వు చేయనున్నట్లు సురేశ్‌ ప్రభు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే వ్యవస్థ పర్యావరణ పరిరక్షణకు, స్వచ్ఛ ఇంధన వినియోగానికి కట్టుబడి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.