చిన్నారుల ఆచూకీ కోసం.. గుహకు డ్రిల్లింగ్‌

SMTV Desk 2018-07-07 17:16:15  Thailand cave rescue, thailand foot ball players, thailand cave issue, bangkok

బ్యాంకాక్, జూలై 7 : థాయిలాండ్‌ లోని థామ్‌ లూవాంగ్‌ గుహలో చిక్కుకుపోయిన 13 మంది(12 మంది పిల్లలు+వారి ఫుట్‌బాల్‌ కోచ్‌)ని కాపాడేందుకు సహాయక సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. చిన్నారులు ఉన్న ప్రదేశానికి సమీపంలోనే గుహకు డ్రిల్లింగ్‌ చేసి వాటి ద్వారా గొట్టాలను పంపిస్తున్నారు. దీని ద్వారా చిన్నారులు గుహలో ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుహలో వరద నీరు ఉండటం వల్ల డైవింగ్‌ చేసుకుంటూ వాళ్లని బయటకు తీసుకురావడం కష్టతరమైన మార్గమని రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 400 మీటర్ల వరకూ డ్రిల్లింగ్‌ చేశారు. కానీ చిన్నారులు కచ్చితంగా ఎక్కడ ఉన్నారన్నది మాత్రం గుర్తించలేకపోయారు. కనీసం 600 మీటర్ల లోతులో చిన్నారులు ఉండి ఉండొచ్చని సహాయక చర్యల్లో పాల్గొన్న నరోంగ్సాక్‌ అనే అధికారి తెలిపారు. సుమారు 100కి పైగా రంధ్రాలు చేసి వాటి ద్వారా గుహ లోపలికి గొట్టాలను పంపించేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గుహలో ఆక్సిజన్‌ స్థాయి పడిపోతోందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. చిన్నారులకు తాజా గాలిని అందించేందుకు ప్రత్యేకంగా పైపు లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు గుహలో నుంచి దాదాపు 130 మిలియన్ల లీటర్ల నీటిని పైపుల ద్వారా బయటకు పంపించినట్లు అధికారులు వెల్లడించారు. జూన్‌ 23న థాయ్‌ లుయాంగ్‌ గుహని సందర్శించేందుకు వెళ్లిన 12 మంది చిన్నారులు, ఫుట్‌బాల్‌ కోచ్‌ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గుహలో నీటిమట్టం, బురద బాగా పెరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గుహలో తప్పిపోయి 10 రోజుల తర్వాత ఇద్దరు బ్రిటీష్‌ డైవర్లకు సజీవంగా కనిపించిన ఫుట్‌బాల్‌ టీమ్‌ను రక్షించేందుకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది.