నేడు తెలంగాణ పాఠశాలల్లో గ్రీన్ డే....

SMTV Desk 2017-07-15 12:36:09  GREENDAY , SCHOOLS ,HARITHA HARAM ,CMKCR

హైదరాబాద్, జూలై 15 : భావి తరాల వారికి స్పూర్తినిచ్చే పని ఏదైనా ఉందంటే అది తప్పకుండా హరితహారం అనే చెప్పాల్సి వస్తుంది. కాలానుగుణంగా జరిగే మార్పుల వల్ల పర్యావరణం చాలా వరకు అంతరించి పోతున్న తరుణంలో దేశం లో మరెక్కడా లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. "నేటి బాలలే రేపటి పౌరులు" అన్న మన పెద్దల మాట ను దృష్టిలో ఉంచుకొని మార్పు వారి నుండే మొదలవ్వాలని ఈ గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగిందని కేసిఆర్ ముఖ్యంగా ఉద్దేశించారు. దాని లో భాగమే ఈ రోజు నిర్వహించే కార్యక్రమం... తెలంగాణకు హరితహారం మూడో విడుతలో భాగంగా రాష్ట్ర పాఠశాలలో ఘనంగా గ్రీన్ డే ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లోని ప్రభుత్వ పాఠశాలలో గవర్నర్ నరసింహన్ దంపతులు, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మొక్కలను నాటనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుగన్న హరిత తెలంగాణ కోసం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఈ గ్రీన్ డేను చేపట్టనున్నారు. గ్రామాలు, పట్టణాలలో ఉదయం 9 గంటల నుంచి హరితహారం పై ర్యాలీలు చేయనున్నారు. తదుపరి 10 గంటలకు 28 లక్షల మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, "హరిత పాఠశాలల నుంచే హరిత తెలంగాణ" అంటూ నినదించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హరితహారం కార్యక్రమం పై పాఠశాలస్థాయి లో విద్యార్ధులకు వ్యాసరచన, వ్యక్తిత్వ వికాసం, డ్రాయింగ్, నాటికలు, క్విజ్ వంటి పోటీలను నిర్వహించి విజేతలకు ఆగష్టు 15న బహుమతులు అందించనున్నారు. ప్రజాప్రతినిధులు, స్థానికులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున మొక్కలను నాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. జిల్లాల వారీగా డీఈవోలు, ఎంపీడీవోలు, ఎంఈవోలు మొక్కలను నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మొక్కలను సంరక్షించేందుకు ఉపాధ్యాయులు, విద్యార్ధులే గ్రీన్ బ్రిగ్రేడ్ గా వ్యవహరించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు 50 లక్షల మొక్కలు నాటాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.