వరంగల్ విషాదం: తేరుకోలేకపోతున్న బాధితులు

SMTV Desk 2018-07-05 14:30:25   Warangal fire cracker godown blast, warangal fire crackers incident, kotilingala, hyderabad

వరంగల్, జూలై 5 ‌: ప్రశాంతంగా ఉన్న ఓరుగల్లు నగరం బుధవారం ఒక్క సారి ఉలిక్కి పడింది. నగర పరిధిలోని 3వ డివిజన్‌ కీర్తినగర్‌ కోటిలింగాల గుడి సమీపంలోని శ్రీ భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌(బాణాసంచా తయారీ కేంద్రం)లో భారీ విస్పోటనం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈదుర్ఘటన నుండి బాధితులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొందరు తమకు సరిగా వినిపించడం లేదని బాధపడుతున్నారు. ఇప్పటికీ ఆ భయం నుంచి స్థానికులు కోలుకోలేకపోతున్నారు. దాదాపు చుట్టుపక్కల రెండొందలకుపైగా ఇళ్లు ధ్వంసం కాగా.. గోదాములో సామర్థ్యానికి మించి సరకును నిల్వ ఉంచడం వల్లే ఇలాంటి ఘటన జరిగి ఉంటుందని స్థానికులు తెలుపుతున్నారు. గోదాంలోకి ఎప్పుడూ, ఎవరినీ వెళ్లనివ్వకుండా కుక్కలు కాపాలా ఉంటాయని.. కేవలం చిన్న కార్యక్రమాలకు టపాసులు తయారు చేస్తున్నారని అనుకున్నామని స్థానికులు చెబుతున్నారు. కానీ మైనింగ్‌ కొండలను పగలకొట్టే సామర్థ్యం ఉన్న బాంబులను తయారు చేస్తున్నారని తెలియదని అక్కడి వారు అంటున్నారు. ధ్వంసం అయిన ఇళ్లకు పరిహారం అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జనవాసాల మధ్యలో ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.