కుప్పకూలిన సిటీ బస్ స్టేషన్..

SMTV Desk 2018-07-05 13:16:26  cbs bus station shed collapsed, cbs bus station, hyderabad, ghmc officers

హైదరాబాద్, జూలై 5 : నగరంలోని గౌలిగూడలోని సిటీ బస్ స్టేషన్(సీబీఎస్) ఈ ఉదయం హఠాత్తుగా కుప్పకూలింది. పట్టీలు తుప్పు పట్టడం.. సరైన మరమ్మతులు లేకపోవటంతో షెడ్డు కుంగిపోయింది. అయితే ఆర్టీసి అధికారులు ప్రమాదాన్ని ముందే పసిగట్టి అప్రమత్తమవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. వర్షాల వల్ల బస్టాండ్ పైకప్పుగా వేసిన రేకులు, వాటికి ఆధారంగా వేసిన ఇనుప రాడ్లు కూడా తుప్పుపట్టిపోయాయి. అసలే శిథిలావస్థకు చేరిన షెడ్డుకు ఈ వర్షాల వల్ల ఎప్పుడైనా ప్రమాదం సంభవించొచ్చని భావించిన ఆర్టీసి అధికారులు మూడురోజుల క్రితమే దీన్ని మూసేశారు. బస్సులను అందులోకి అనుమతించకుండా బారిగేడ్లను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం భారీ శబ్దంతో షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలింది. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ, ఆర్టీసీ ఉన్నతాధికారులు కూలిన షెడ్‌ను తొలగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. 10 రోజుల్లో తొలగింపు పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిజాం కాలంలో నిర్మితమైన ఈ బస్టాండ్ 88 ఏళ్లపాటు ప్రజలకు సేవలు అందించింది. ఈ బస్టాండ్ ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు బస్సులు నడిచేవి. అయితే 1994లో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్) నిర్మించడంతో.. జిల్లాల బస్సులను అక్కడి నుంచే నడుపుతున్నారు. ప్రస్తుతం సిటీ బస్సులు మాత్రమే గౌలిగూడ సిటీ బస్టాండ్ నుంచి నడుపుతున్నారు.