ఆ పాప పేరు చేతన..

SMTV Desk 2018-07-04 18:50:48  infant baby kidnap, baby kidnap in koti, anjani kumar, hyderabad cp anjani kumar

హైదరాబాద్, జూలై 4 : సుల్తాన్ ప్రసూతి ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ లభించిన విషయం తెలిసిందే. నిన్న మధ్యాహ్నం గుర్తు తెలియని మహిళ ప్రసూతి వైద్యశాలలోకి వచ్చి టీకా వేయిస్తానని చెప్పి తల్లి వద్ద నుంచి చిన్నారిని అపహరించుకెళ్లిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. పసిపాప ఆచూకీని పోలీసులు బీదర్‌లో గుర్తించారు. తమ చిట్టితల్లిని సురక్షితంగా చేర్చిన ఏసీపీ, పోలీసుల పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తాన్‌ బజార్‌ ఏసీపీ డాక్టర్‌ చేతన నేతృత్వంలో పోలీసు బృందాలు తీవ్రంగా గాలించాయి. సీసీ కెమెరాల ద్వారా ఆమె ఎంజీబీఎస్‌ బస్‌ స్టేషన్‌లో బీదర్‌ వెళ్లే బస్సు ఎక్కిందని గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లారు. ఏసీపీ చేతన స్వయంగా బీదర్‌కు వెళ్లి పరిస్థితిని సమన్వయం చేసి చివరకు ఆ శిశువును సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన విషయం తెలిసిందే. తమ బిడ్డను సురక్షితంగా అప్పగించిన పోలీసులకు ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాకుండా ఆ శిశువుకు ఏసీపీ చేతన పేరే పెట్టారు. ఈ విషయాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. ఆ పాప బాగా చదువుకుని చేతనలాగే తయారుకావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన కోఠి ప్రసూతి ఆస్పత్రిని సందర్శించి అక్కడి రక్షణ చర్యల్ని పరిశీలించారు. సమష్టి కృషితో శిశువును తల్లి చెంతకు చేర్చిన పోలీసు సిబ్బందిని అభినందించారు. కోఠి ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఇలాంటి శిశువు అపహరణ ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆస్పత్రుల్లోనూ చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.