లెఫ్టినెంట్ గవర్నర్ vs ఢిల్లీ సర్కారు : కీలక తీర్పు..

SMTV Desk 2018-07-04 12:36:54  Arvind Kejriwal vs delhi l Lieutenant Governor, supreme court, delhi, aap party

ఢిల్లీ, జూలై 4 : ఆమ్‌ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దేశరాజధాని ఢిల్లీలో గత మూడేళ్లుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ప్రభుత్వం మధ్య తలెత్తిన అధికారాల వివాదంలో ఆమ్‌ఆద్మీ పార్టీ సర్కార్ విజయం సాధించింది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు స్వతంత్ర అధికారాలు లేవని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. గత మూడేళ్లుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ప్రభుత్వం మధ్య తలెత్తిన అధికారాల వివాదంలో ఆమ్‌ఆద్మీ పార్టీకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కొన్ని పరిమితులుంటాయని తెలిపింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రభుత్వంతో కలిసి సఖ్యతగా పనిచేయాలని కోర్టు సూచించింది. దీనికి సంబంధించిన తీర్పు ప్రతులను సీజేఐ దీపక్‌ మిశ్రా చదివి వినిపించారు. " లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాలి. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. కేంద్ర, రాష్ట్ర సంబంధాల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉండాలి. ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వం కూడా కేబినెట్ నిర్ణయాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు తెలియజేయాలి. అయితే అన్ని అంశాల్లో ఎల్జీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ యాంత్రికంగా వ్యవహరించకూడదు. మంత్రి మండలి నిర్ణయాలను అడ్డుకోకూడదు. ఎల్జీకి స్వతంత్ర అధికారాలు లేవు. కొన్ని వ్యవహారాల్లో అభిప్రాయభేదాలు వస్తే దాన్ని ఎల్జీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లొచ్చు"అని జస్టిస్‌ మిశ్రా వ్యాఖ్యానించారు. భారీ మెజార్టీతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన క్రేజీవాల్ సర్కార్ ఆది నుంచి లెఫ్టినెంట్ గవర్నర్‌ వైఖరితో విభేదిస్తోంది. ఢిల్లీ అభివృద్ధిని, మంత్రి మండలి నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్లు అడ్డుకుంటున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కేంద్రం కాలరాస్తోందంటూ ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తొమ్మిది రోజుల పాటు ఎల్జీ అనిల్‌ బైజాల్‌ ఇంట్లో ధర్నా చేసిన విషయం తెలిసిందే. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవహారాల్లో తలదూరుస్తుందంటూ కేజ్రీవాల్‌ గతంలో ఆరోపించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ప్రభుత్వ పథకాల అమలులో మంత్రిమండలికి సహరించట్లేదని కేజ్రీవాల్‌ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో అరవింద్‌ కేజ్రీవాల్‌కు కొంత ఊరట లభించింది.