పసిపాప కథ సుఖాంతం..!

SMTV Desk 2018-07-03 18:22:41  infant baby kidnap, stolen baby found safe, koti govt maternity hospital, bidar

హైదరాబాద్, జూలై 3 : సుల్తాన్ ప్రసూతి ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ లభించింది. నిన్న మధ్యాహ్నం గుర్తు తెలియని మహిళ ప్రసూతి వైద్యశాలలోకి వచ్చి టీకా వేయిస్తానని చెప్పి తల్లి వద్ద నుంచి చిన్నారిని అపహరించుకెళ్లిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. పసిపాప ఆచూకీని పోలీసులు బీదర్‌లో గుర్తించారు. తల్లిఒడిలో ఉండాల్సిన పసికందుకు సకాలంలో తల్లిపాలు అందకపోవడంతో నీరసించిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సుల్తాన్‌బజార్‌ పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా ఆమె బీదర్‌ వైపు వెళ్లినట్టు గుర్తించారు. ఏసీపీ చేతన నేతృత్వంలో పది బృందాలుగా విడిపోయిన పోలీసులు బీదర్‌కు వెళ్లి నిన్న రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారిని ఎత్తుకెళ్లిన మాయలేడి ఫొటోలను పలు పోలీస్‌స్టేషన్లకు పంపి అప్రమత్తం చేశారు. అయితే, గాలింపు చర్యల్లో భాగంగా అక్కడికి వెళ్లిన పోలీసులు గుర్తు తెలియని పాప ఆస్పత్రి బయట ఉందన్న సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్లారు. అనంతరం పాపను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాప అపహరణకు గురై సుమారు 30 గంటలు దాటడంతో పాటు ఎక్కువ సమయం ప్రయాణం చేయడంతో పాపకు అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రస్తుతం చిన్నారిని ఎత్తుకెళ్లిన మాయలేడి పరారీలో ఉంది. అయితే, ఆ మహిళ ఎవరు? గతంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిందా? ఆమెకు ఆస్పత్రిలో ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. శిశువు దొరకడంతో తల్లి విజయ సంతోషం వ్యక్తం చేసింది. పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. పోలీసులు ఆమెకు శిశువును వీడియో చాట్‌ ద్వారా చూపించడంతో ఆనందం వ్యక్తం చేసింది.