భారత్ లో ఏమి లేదు : మాల్యా

SMTV Desk 2017-07-14 15:59:44  VIJAY MAALYAA , LONDON, BHAARATH, ARREST, BAIL, CRICKET MATCH, RUNNING RACE, LUXURIOUS LIFE.

లండన్, జూలై 14 : భారత్ లో పలు బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి లండన్‌ పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాపై దేశంలో పలుచోట్ల అనేక కేసులు నమోదైన విషయం తెలిసిందే. మాల్యాను స్వదేశానికి రావాలని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన పట్టించుకోలేదు. ఒక్కసారి భారత్‌ వస్తే.. కేసులన్నీ ఆయన్ను చుట్టుముడుతాయని ఆయన ఇంగ్లాండ్‌ వదిలి రావడంలేదు. ఇదిలా ఉండగా లండన్‌లో ఆయన విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. పరుగుపందాలు, వింబుల్డన్‌, క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇటీవలే లండన్‌లో జరిగిన ఫార్ములావన్‌ ప్రమోషనల్‌ ఈవెంట్‌లోనూ మాల్యా దర్జాగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఓ విలేకరి మీరు భారత్ ను మిస్ అవుతున్నారా? అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. అసలు అక్కడ మిస్ అవ్వడానికి ఏం లేదు నా కుటుంబం అంతా ఇంగ్లాండ్, అమెరికాలలో ఉన్నారు. భారత్ లో ఒక్కరు కూడా లేరు. నా తోబుట్టువులు కూడా యూకే పౌరసత్వం పొందినవారే. ఇక కుటుంబ పరంగా భారత్ లో మిస్ అవ్వడానికి ఏం లేదు అని చెప్పుకొచ్చాడు. తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడుతూ కావాలనే ఇలాంటి కేసులు పెడుతున్నారని చెప్పారు. కాగా మాల్యాను భారత్ కు రప్పించే కేసు విచారణ లండన్ కోర్టులో కొనసాగుతుంది. ఇటీవలే మాల్యాను అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఆయనను భారత్ రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.