కశ్మీర్ లో కమల దళ రాజకీయం..

SMTV Desk 2018-07-03 12:16:35  jammu kashmir politics, bjp in jammu kashmir, bjp vs pdp, congress

న్యూఢిల్లీ, జూలై 3 : జమ్ము కశ్మీర్ రాజకీయాలు కొత్త మలుపు తిరిగేల కనిపిస్తుంది. ప్రస్తుతం గవర్నర్‌ పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీడీపీ అధినేత్రి, జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి భారీ షాక్‌ తగిలింది. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ)లో గ్రూప్‌ రాజకీయాలు మొదలయ్యాయి. బీజేపీతో బ్రేకప్‌ను జీర్ణించుకోలేని ముగ్గురు పీడీపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి ఇమ్రాన్‌ అన్సారీ, మహ్మద్‌ అబ్బాస్‌ వానీ, వీరిద్దరితోపాటు మరో సీనియర్‌ నేత అబిద్‌ అన్సారీ.. మెహబూబాకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరేశారు. మరికొందరిని కూడగలుపుకుని ఈ రెబల్స్‌ కొత్త పార్టీ ఏర్పాటు నిర్ణయానికి వచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురిస్తోంది. వీరంతా కలసి తమ మద్దతుదారులతో సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. దీంతో పీడీపీలో చీలిక తప్పకపోవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా పీడీపీ, కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ)లను చీల్చి.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం కాంగ్రె్‌సను ఆందోళనకు గురిచేస్తోంది. పీడీపీలో చీలిక తీసుకొచ్చి అసమ్మతి నేతలను తనవైపు తిప్పుకోడానికి బీజేపీ వ్యూహ రచన చేస్తోందని గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 87 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 44 మంది సభ్యుల మద్దతు (మ్యాజిక్ ఫిగర్) అవసరం. ఇందులో పీడీపీకి 28 మంది, బీజేపీకి 25 మంది, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15 మంది, కాంగ్రెస్‌కు 12 మంది సభ్యులుండగా.. 7 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.