ఫిఫా-2018 : అర్జెంటీనా, పోర్చుగల్‌ ఔట్..

SMTV Desk 2018-07-01 11:28:10  fifa foot ball cup-2018, argentina vs france, portugal vs uruguay, fifa knock out

కజాన్, జూలై 1 ‌: ఫిఫా ప్రపంచకప్‌ ఫుట్ బాల్ కప్ నుండి అర్జెంటీనా నిష్క్రమించింది. టోర్నీలో భాగంగా జరిగిన తొలి నాకౌట్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ ఆదరగోట్టింది. మాజీ ఛాంపియన్‌ అర్జెంటీనాపై 4-3తో అద్భుత విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకుంది. ఫ్రాన్స్‌ యువకెరటం కైలిన్‌ ఎంబాపె మెరుపులకు అర్జెంటీనా వెలుగు మసకబారింది. ఫలితంగా సూపర్‌ స్టార్‌ మెస్సీ నాయకత్వంలోని జట్టు పయనం 2018 ప్రపంచకప్‌లో ప్రి క్వార్టర్స్‌తోనే ముగిసింది. ప్రపంచకప్‌ చరిత్రలో అర్జెంటీనాపై ఫ్రాన్స్‌ జట్టుకిదే తొలి విజయం కావడం విశేషం. ఫ్రాన్స్‌ తరఫున ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఎంబాపె (64వ, 68వ నిమిషాలు) రెండు గోల్స్‌ కొట్టగా, ఆంటోన్‌ గ్రీజ్‌మన్‌ (13వ ని.), పవార్డ్‌ (57వ ని.) చెరో గోల్‌ చేశారు. అర్జెంటీనాకు డి మారియా (41వ ని.), మెర్కాడో (48వ ని.), కున్‌ అగ్యురో (90+3వ ని.) స్కోరు అందించారు. మరో మ్యాచ్ లో రోనాల్డ్ సేన కూడా మెస్సి జట్టు బాటలో పయనించింది. ఎన్నో అంచనాల నడుమ సాకర్‌ సమరంలో అడుగుపెట్టిన పోర్చుగల్‌ కథ ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో నాకౌట్‌ పోరులొ ఉరుగ్వే 2-1తో పోర్చుగల్‌పై ఘన విజయం సాధించింది. తొలి క్వార్టర్‌ ఫైనల్‌లో ఉరుగ్వే జులై 6న ఫ్రాన్స్‌తో తలపడనుంది.