పునః ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర..

SMTV Desk 2018-06-30 16:36:44  #amaranath yatra, amaranath yatra pilgrims, jammu kashmir, sri nagar

శ్రీనగర్‌, జూన్ 30 : జమ్మూ కశ్మీర్ భారీ వర్షాలు, వరద హెచ్చరికల నేపథ్యంలో అధికారులు శుక్రవారమే అమర్‌నాథ్‌ యాత్రను నిలిపేసిన విషయం తెలిసిందే. యాత్ర ప్రారంభమైన తర్వాత ఇలా చేయడం ఇది రెండోసారి. కాగా శనివారం నాటికి వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో యాత్రను పునః ప్రారంభించారు. ఈ రోజు మధ్యాహ్నానికి అమర్‌నాథ్‌ యాత్రను పునఃప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. బత్లాల్‌, పహల్గామ్‌ మార్గాల్లో భక్తులు యాత్రను మళ్లీ మొదలుపెట్టారు. దీంతో పాటు వాయుమార్గం ద్వారా కూడా యాత్రికులను చేరుస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా జీలం నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో జీలం నది పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సహాయక శిబిరాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు తెలిపారు.