ఫుట్‌ఫాత్‌ పై అక్రమ కూల్చివేతలు షురూ..

SMTV Desk 2018-06-30 13:50:49  GHMC readies for drive against footpath, ghmc foot path encroachments, hyderabad, tealangana

హైదరాబాద్‌, జూన్ 30 : హైదరాబాద్ మహానగర పరిధిలోని పాదచారుల బాటల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఫుట్ పాత్ లపై కూల్చివేతలను శనివారం ఉదయం నుంచి అధికారులు చేపట్టారు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న పాదచారుల బాటలపై దుకాణ యజమానులు స్థలాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో పాదచారుల బాట కనుమరుగైంది. జీహెచ్ఎంసీ సిబ్బంది వీటిని.. తీసివేసేందుకు రంగంలోకి దిగారు. నగరంలోని దాదాపు 4 వేలకు పైగా నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దీనికోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపారు. పాదచారుల బాటలపై ఏర్పాటు చేసిన ప్రకటనల బోర్డులు, మెట్లు, ప్రహరీ గోడలను కూల్చివేస్తున్నారు. దీనికోసం 120 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కూల్చివేసిన శిథిలాలను ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. సిబ్బందికి కూల్చివేతలపై ఇప్పటికే శిక్షణ ఇచ్చామని కమిషనర్‌ డాక్టర్‌.బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. అధునాతన యంత్రాలనూ రంగంలోకి దించుతున్నామన్నారు. ఫుట్‌ఫాత్‌ల తొలగింపు సందర్భంగా ఎలాంటి పరిస్థితులెదురైనా ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు తగిన ప్లాన్‌ చేశారు.