రూ.1.36 లక్షల కోట్ల రాష్ట్ర రుణ ప్రణాళిక విడుదల..

SMTV Desk 2018-06-29 15:54:31  etela rajender, ts financial minister etela rajender, bankers summit, hyderabad

హైదరాబాద్, జూన్ 29 : హైదరాబాద్‌లో గురువారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.1,36,733 కోట్ల రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగానికి రుణాలను పెంచాలని ఆయన బ్యాంకులను కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, ఆర్‌బీఐ ప్రాంతీయ డైరెక్టర్‌ సుబ్రమణియన్‌, ఎస్‌ఎల్‌బీసీ ఛైర్మన్‌, ఎస్‌బీఐ సీజీఎం స్వామినాథన్‌, నాబార్డ్‌ సీజీఎం పి.రాధాకృష్ణన్‌, ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి వి.సాయిప్రసాద్‌ వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుశాఖల సంఖ్య పెంచాలని, నిరుద్యోగయువత ఉపాధి పొందేలా రుణాలు ఇవ్వాలని కోరారు. రైతులకు రూ.5 లక్షల బీమా ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వస్తుందని మంత్రి చెప్పారు. రైతుబంధు అమలుకు బ్యాంకులు అందించిన సహకారం పట్ల వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వడ్డీలేని రుణాల బకాయిలు రూ.506 కోట్లు ప్రభుత్వం విడుదల చేయాలని బ్యాంకర్లు కోరారు. మొత్తం వ్యవసాయ రుణాల్లో గడువు తీరినా చెల్లించని రుణ మొత్తం 24% ఉన్నట్లు బ్యాంకర్లు తెలిపారు.