పెద్ద పొరపాటు: చరిత్ర సృష్టించిన మిథాలీ ఎవరో కోహ్లీకి తెలియదా?

SMTV Desk 2017-07-14 12:12:15  

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ఓ పొరపాటు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డేల్లో ఆరువేల పరుగులు చేసి ప్రపంచంలో ఆ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్‌వర్డ్స్‌ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. మిథాలీ 183 మ్యాచ్‌ల్లో 6028 పరుగులు చేయగా, ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెట్‌ ఎడ్‌వర్డ్స్‌ 191 మ్యాచ్‌ల్లో 5992 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కి ముందు ప్రపంచ రికార్డు సాధించేందుకు గాను మిథాలీకి 34 పరుగులు అవసరమయ్యాయి.ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో పెర్రీ బంతిని కవర్స్‌లోకి నెట్టి రికార్డును అందుకుంది. ఇక లెగ్ బ్రేక్ బౌలర్ బీమ్స్ బంతిని భారీ సిక్సర్‌గా మలిచి ఆరువేల పరుగుల మైలురాయిని చేరుకుంది. ప్రపంచ రికార్డు సాధించిన మిథాలీపై పలువురు క్రికెటర్లు, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కూడా ఫేస్‌బుక్‌లో మిథాలీకి కంగ్రాట్స్ చెప్పాడు. అయితే ఇక్క‌డే అత‌డు పెద్ద పొర‌పాటు చేశాడు. మిథాలీ రాజ్ ఫొటోను కాకుండా పొరపాటున మరో క్రికెటర్ పూనమ్ రౌత్ ఫొటోను అప్ లోడ్ చేశాడు. ఈ త‌ప్పును అత‌ను గ్ర‌హించ‌లేక‌ పోయాడు. క్రికెట్ అభిమానులు ఈ తప్పిదంపై కోహ్లీని ట్రోల్ చేసినా... చాలా సేపటి వరకు ఆ ఫోటో అలానే ఉంది. అయితే ఆ తర్వాత ఈ ఫోటోతో పాటు పోస్ట్‌నే ఫేస్‌బుక్ పేజి నుంచి డిలీట్ చేశాడు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఎవరో కూడా కోహ్లీకి తెలయదా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.