కడప ఉక్కు పరిశ్రమ పై స్పందించిన బీరేంద్ర సింగ్‌..

SMTV Desk 2018-06-27 17:33:37   CHAUDHARY BIRENDER SINGH, KADAPA STEEL FACTORY, TDP MP CM RAMESH, B.TECH RAVI

ఢిల్లీ, జూన్ 27 : తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆమరణ నిరాహార దీక్ష ఎనిమిదో రోజుకు చేరిన తరుణంలో ఆయనతో టీడీపీ ఎంపీల భేటీ ముగిసింది. తర్వాత ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ టీడీపీ ఎంపీల సమక్షంలోనే మీడియా సమావేశంలో మాట్లాడారు. కడప ఉక్కు కర్మాగారం విషయంపై ఎంపీలు తనతో చర్చించారని, సుప్రీంలో దాఖలైన పిల్‌ విషయంలో కేంద్ర ఉక్కు శాఖ అఫిడవిట్‌ దాఖలు చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ అఫిడవిట్‌ను ఆయన చదివి వినిపించారు. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయట్లేదన్న వార్తలపై తాము వెంటనే ప్రకటన ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఉక్కు పరిశ్రమల ఏర్పాటుపై సరైన మార్గంలో అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. టాస్క్‌ఫోర్స్‌ అధ్యయనం చేస్తోందని, రవాణా, నీరు, భూమి, రాయితీ అంశాలపై రాష్ట్రప్రభుత్వ స్పందనను తాము కోరామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంకా రెండు అంశాలు మినహా అన్ని విషయాలపై సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. అన్ని అంశాలను పరిశీలించి టాస్క్‌ఫోర్స్‌ త్వరలో నివేదిక ఇస్తుందని మంత్రి చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టంచేశారు. 1.5 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కల్గిన ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత సమాచారం రావాల్సి ఉందని, దాని కోసం వేచిచూస్తున్నట్టు చెప్పారు.