యూజీసీ స్థానంలో హెచ్‌ఈసీఐ..!

SMTV Desk 2018-06-27 16:11:38  ugc, heci in place of ugc, university grants commission, delhi, monsoon parliament sessions

ఢిల్లీ, జూన్ 27 : దేశీయ ఉన్నత విద్య రంగంలో పెను మార్పునకు కేంద్రప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే దశాబ్దాలుగా కొనసాగుతున్న యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)ను తొలగించి.. ఆ స్థానంలో ఉన్నత విద్యా కమిషన్‌ (హైయర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా-హెచ్‌ఈసీఐ)ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ ఓ డ్రాఫ్ట్‌ బిల్లును కూడా సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు మానవ వనరులశాఖ తెలిపింది. అంతేగాక, డ్రాఫ్ట్‌ బిల్లు కోసం ప్రజల నుంచి సలహాలు కూడా కోరుతోంది. రానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త కమిషన్‌తో విద్యాసంస్థలకు స్వయంప్రతిపత్తి పెరుగుతుందని, సౌకర్యాలు మెరుగుపడుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అంతేగాక.. భారత విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. ఉన్నత విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇస్తోందని ఇటీవల ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేసే అవకాశలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.