డిప్యూటీ ఛైర్మన్‌ రేస్ రసవత్తరం..!

SMTV Desk 2018-06-27 13:41:24  rajyasabha deputy chairman, rajyasabha deputy chairman election, congres and tmc, bjp

ఢిల్లీ, జూన్ 27 : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక తాజాగా ఆసక్తి రేపుతోంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత బరిలోకి దిగే సూచనలు కన్పిస్తున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అటు అధికార భాజపా కూడా తమ అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తుండటంతో డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి ఈసారి ఎన్నిక అనివార్యం కానుంది. ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన పీజే కురియన్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఈ పదవి కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. పెద్దలసభలో అధికార ఎన్డీయే కూటమి కంటే ప్రతిపక్షాల సంఖ్యా బలం ఎక్కువ. దీంతో ప్రతిపక్షాలన్నీ కలిపి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నాయి. ఇందుకు భాజపా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి తమ పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తుంది. మరోవైపు ప్రతిపక్షాల కూటమికి తొలుత కాంగ్రెస్‌ సారథ్యం వహించాలని భావించింది. అయితే ఈ ఎన్నికల్లో భాజపాపై విజయం సాధించాలంటే బిజు జనతాదళ్‌, తెరాస మద్దతు అవసరం. ఈ రెండు పార్టీలు తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికే మొగ్గుచూపుతున్నాయి. దీంతో ప్రతిపక్షాల కూటమికి తృణమూల్‌ కాంగ్రెస్‌ సారథ్యం వహించేందుకు కాంగ్రెస్‌ అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తృణమూల్‌ నేత సుఖేందు శేఖర్‌ రాయ్‌ను డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక బరిలోకి దించాలని విపక్షాలు భావిస్తున్నాయి.