ఫిఫా : నాకౌట్‌కు చేరిన అర్జెంటీనా..

SMTV Desk 2018-06-27 11:07:29  fifa-2018, argentina vs nigeria, fifa foot ball world cup, lionel messi

సెయింట్‌పీటర్స్‌బర్గ్, జూన్ 27‌: ఫిఫా ప్రపంచకప్‌-2018 పోటీల్లో అర్జెంటీనా జట్టు నాకౌట్‌ దశకు దూసుకెళ్లింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు సమష్టిగా పోరాడి 2-1తో నైజీరియా పై గెలుపొందింది. దీంతో అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. ఈ విజయంతో ఆ జట్టు తుది-16లో చోటు దక్కించుకుంది. ప్రపంచకప్‌లో నాకౌట్‌కు చేరడం అర్జెంటీనాకు ఇది వరుసగా నాలుగోసారి. టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి అర్జెంటీనా-నైజీరియా మధ్య మ్యాచ్‌ జరిగింది. 14వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మెస్సి గోల్‌ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మెస్సి కొట్టిన ఈ గోల్‌ ఫిఫా ప్రపంచకప్‌-2018లో ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ మెగా టోర్నీలో ఇది వందో గోల్‌ కావడం విశేషం. ఆ తర్వాత 51వ నిమిషంలో నైజీరియా ఆటగాడు విక్టర్‌ మోసెస్‌ పెనాల్టీ ద్వారా గోల్‌ సాధించి స్కోరును సమం చేశాడు. ఇక అక్కడి నుంచి ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. 86వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మార్కస్‌ రోజో మరో గోల్‌ కొట్టడంతో అర్జెంటీనా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆట ముగిసేలోపు నైజీరియా మరో గోల్‌ చేయకపోవడంతో ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం సాధించింది. గ్రూప్‌-డిలో జరిగిన మరో మ్యాచ్‌లో క్రొయేషియా 2-1 తేడాతో ఐస్‌లాండ్‌పై విజయం సాధించింది. ఈ ఏడాది ప్రపంచకప్‌లో క్రోయేషియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గ్రూప్‌-డి నుంచి క్రోయేషియా, అర్జెంటీనా నాకౌట్‌కు చేరుకున్నాయి.