ఇంగ్లండ్ పర్యటనలో ఆల్‌రౌండర్లే కీలకం : సచిన్

SMTV Desk 2018-06-26 18:41:43  england tour of india, india vs ireland, sachin tendulkar, sachin

న్యూఢిల్లీ, జూన్ 26 : ఇంగ్లండ్ పర్యటనలో ఆల్‌రౌండర్లే కీలకం కానున్నారని టీమిండియా మాజీ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అన్నాడు. టీమిండియా జట్టు మునుపెన్నడూ లేనంత బలమైన బౌలింగ్ లైనప్‌తో ఇంగ్లండ్‌తో సుదీర్ఘ సిరీస్‌లో తలపడటానికి సిద్ధమైందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ నెల 27, 29న ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో.. సచిన్ టెండూల్కర్ మీడియాతో మాట్లాడుతూ భారత జట్టు బలాబలాలపై తన అభిప్రాయాన్ని పంచుకొన్నాడు. "భారత్ జట్టులో స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌, ఎత్తైన బౌలర్ ఇషాంత్ శర్మ, స్కిడ్డీ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా, వేగవంతంగా బంతులు విసిరే ఉమేశ్ యాదవ్‌లు ఉన్నారు. ఇలాంటి కాంబో జట్టుకి అదనపు ప్రయోజనాలు చేకూరతాయి. ఇదే కచ్చితంగా అత్యుత్తమ బౌలింగ్‌ యూనిట్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత జట్టు మేనేజ్‌మెంట్ బ్యాట్‌తో పరుగులు రాబట్టే ఫాస్ట్ బౌలర్లవైపు ఎక్కువ మొగ్గు చూపుతోంది. భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య ఇప్పటికే బ్యాట్‌తో కూడా రాణించారు. ఇంగ్లండ్ పర్యటనలో అలాంటి ఆల్‌రౌండర్లే కీలకం కానున్నారు" అని సచిన్ వ్యాఖ్యానించాడు.