ఎంఎన్‌పీ ఇక కష్టమేనా..!

SMTV Desk 2018-06-26 12:06:22  MNP PROCESS, MOBILE NUMBER PORTBILITY, MNP PROCESS, DOT IN TELICOM

ఢిల్లీ, జూన్ 26 : (ఎంఎన్‌పీ) మొబైల్ నంబర్ పోర్టబులిటీ.. మనం వాడుతున్న నెంబర్ మార్చకుండా.. ఇతర నెట్ వర్క్ మరలడం.. కానీ ఇక నుంచి ఈ ప్రక్రియ కష్టతరం అయ్యే అవకాశాలున్నాయట. ​దేశంలో మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ సేవలను అందిస్తున్న ఇంటర్ కనెక్షన్ టెలికాం సొల్యూషన్స్, సినివెర్స్ టెక్నాలజీస్ సంస్థలు ఎంఎన్‌పీ సేవలను 2019 మార్చి నుంచి నిలిపివేయనున్నాయని ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది. పోర్టింగ్‌ ఛార్జీలను భారీ ఎత్తున్న తగ్గించడంతో, ఈ సర్వీసులను నిలిపివేయనున్నామని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డీఓటీ)కి ఈ కంపెనీలు లేఖ రాసినట్టు రిపోర్టు పేర్కొంది. ఒకవేళ ఈ కంపెనీలు అన్నట్టుగానే సర్వీసులను నిలిపివేస్తే... వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు మారడం ఇక అంత సులువు కాదు. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఎంఎన్‌పీ ఫీజులను టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌ 19 రూపాయల నుంచి 4 రూపాయల వరకు అంటే 80 శాతం మేర తగ్గించింది. అప్పటి నుంచి తాము నష్టాలను చవిచూస్తున్నామని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి తమ లైసెన్స్ ముగియగానే ఎంఎన్‌పీ సేవలు నిలిపివేస్తామని డీఓటీకి తాజాగా రాసిన లేఖలో ఈ రెండు కంపెనీలు పేర్కొన్నాయని రిపోర్ట తెలిపింది. మరోవైపు ఈ సర్వీసులను కొనసాగించడానికి మరో కొత్త సర్వీసు కంపెనీలకు లైసెన్స్‌ ఇచ్చే అవకాశాలున్నాయని టెలికాం వర్గాలంటున్నాయి. వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు, కంపెనీలు నాణ్యమైన సేవలు అందించేలా ప్రభుత్వం ఎంఎన్‌పీ విధానాన్ని ప్రవేశపెట్టింది.