సుష్మాస్వరాజ్‌కు మద్దతు తెలిపిన కాంగ్రెస్..

SMTV Desk 2018-06-25 15:38:14  Sushma Swaraj,External Affairs Minister Sushma Swaraj, congress support sushma swaraj, delhi

ఢిల్లీ, జూన్ 25 : విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలిచింది. ఆమెపై ట్విటర్‌లో విమర్శలు చేస్తోన్న వారిపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ఓ హిందు- ముస్లిం జంటకు పాస్‌పోర్ట్‌ జారీకి నిరాకరించి వివాదంలో చిక్కుకున్న వికాస్‌ మిశ్రా అనే అధికారిని బదిలీ చేయడంపై నెటిజన్లు సుష్మాపై విమర్శలు గుప్పించారు. ట్విటర్‌లో ఆమెను నిందిస్తూ వ్యాఖ్యలు ప్రత్యక్షమయ్యాయి. మతపరమైన కోణం నుంచీ ఆమెపై కొందరు విమర్శలు గుప్పించారు. వేర్వేరు మతాల నేపథ్యం నుంచి వచ్చిన ఓ దంపతులు లఖ్‌నవూలో పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు సంబంధిత అధికారి ఒకరు భర్తను హిందూమతం స్వీకరించాల్సిందిగా కోరారు. ఓ ముస్లిం వ్యక్తిని ఎందుకు మనువాడారంటూ ఆయన భార్యనూ కోప్పడ్డారు. ఆ దంపతుల ఫిర్యాదు నేపథ్యంలో సదరు అధికారి బదిలీ అయ్యారు. ఆ అంశంపై కొందరు సుష్మాస్వరాజ్‌ను తప్పుబడుతూ విమర్శించారు. భాజపా మద్దతుదారులమని చెప్పుకునే పలువురు కూడా సుష్మ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శలు చేశారు. "పరిస్థితులు, కారణాలు ఎలాంటివైనా కావొచ్చు. బెదిరింపులు, హింస, ఒకరిని అగౌరవపరిచేవిధంగా దూషించడం ఎంతమాత్రం సరికాదు. ఈ విషయంలో సుష్మాను నిందించడానికి, అగౌరవపరచడానికి ఎలాంటి అస్కారం లేదు. ఈ అంశంలో మేం సుష్మా నిర్ణయానికి మద్దతు పలుకుతున్నాం. ఆమె చర్యను మేం అభినందిస్తున్నాం" అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.