ముంబైని ముంచెత్తిన వరుణుడు..

SMTV Desk 2018-06-25 13:11:12  heavy rains in mumbai, mumbai rains, mumbai, weather report

ముంబై, జూన్ 25 : దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై వరుణుడు మరోసారి విరుచుకుపడ్డాడు. గత రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోమవారం ఉదయం పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే సమయంలో వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. లోకల్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నగరంలో చాలా చోట్ల రోడ్లపైకి భారీగా వర్షపునీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎంజీ రోడ్డులో చెట్టు కూలి ఇద్దరు మృతిచెందారు. ఐదుగురికి గాయాలయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ముంబై మున్సిపాలిటీ సిబ్బంది రంగంలోకి దిగింది. పలుచోట్ల భారీ పంపులతో నీటిని ఖాళీ చేస్తున్నారు. వర్షం కురుస్తుండటంతో చాలా ప్రాంతాల్లో జనజీవనం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారీ వర్షం ప్రభావం అంధేరి, ఖర్‌, మలద్‌ ప్రాంతాల్లో తీవ్రంగా ఉంది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ముంబయిలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 110.80మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈరోజు కూడా భారీ వర్షాలు పడతాయని.. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాదాపు 2వేల మందికిపైగా ట్రాఫిక్‌ పోలీసులు పరిస్థితిని నియంత్రిస్తున్నారు.