కలెక్టర్ తో ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తన

SMTV Desk 2017-07-14 10:13:26  COLLECTOR, MLA SHANKER NAAYAK, SP.KOTIREDDY, POLICE, ARREST, MAHABHUBABAD.

మహబూబాబాద్, జూలై 14 : మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతీమీనాపై అనుచితంగా ప్రవర్తించిన శాసనసభ్యుడు బానోతు శంకర్‌నాయక్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద జరిగిన హరితహరంలో మొక్కలు నాటి వేదికపైకి వెళుతున్న క్రమంలో ఆయన కలెక్టర్‌ చెయ్యి పట్టుకోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ విషయం పై కలెక్టర్‌ రాతపూర్వకంగా ఎస్పీ కోటిరెడ్డికి ఫిర్యాదు చేయగా, విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని ఆదేశించడంతో శంకర్‌నాయక్‌ క్షమాపణ చెప్పారు. కలెక్టర్‌ క్షమాపణ పట్టించుకోకపోగా జరిగిన అవమానానికి కేసు నమోదు చేయాలని ఎస్పీకి తెలిపారు. కలెక్టర్‌పై అమర్యాదగా ప్రవర్తించినందుకు సెక్షన్‌ 353(విధులకు ఆటంక పరచడం), 354 (మహిళపై అనుచితంగా ప్రవర్తించడం), 509 (మహిళను ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలనే సంకల్పంతో వ్యవహరించడం) కింద పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. సంఘటన స్థలంలో ఉన్న వారిని విచారించిన అనంతరం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేందుకు కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేయడంతో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ నేరుగా మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు రాగానే ఆవరణలోనే అరెస్టు చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు రాకుండా ముందస్తు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంఘటనపై మహబూబాబాద్‌ డీఎస్పీ రాజమహేంద్రనాయక్‌, తొర్రూరు డీఎస్పీ రాజరత్నం, ఏఆర్‌ డీఎస్పీ రాంచందర్‌లు ఎమ్మెల్యేను విచారించినట్లు సమాచారం. కాగా సుప్రీంకోర్టు సూచనల ప్రకారం నోటీసు అందించి సొంత పూచీకత్తుపై ఎమ్మెల్యేను విడుదల చేసినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.