విషాద సంగమం..

SMTV Desk 2018-06-24 11:07:29  krishna river engineering students, krishna river flooded away, amaravathi, krishna

అమరావతి, జూన్ 24 : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమానికి విహారానికి వెళ్లిన ఇంజినీరింగ్‌ విద్యార్థుల యాత్ర విషాదాంతంగా ముగిసింది. శనివారం గోదావరి, కృష్ణా నదుల సంగమ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లి నీట మునిగిన నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ముగ్గురి మృతదేహాలు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి. చైతన్య, శ్రీనాథ్‌, ప్రవీణ్ మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీయగా.. రాజ్‌కుమార్‌ మృతదేహం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దొరికిన ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో అక్కడ విషాదఛాయలు అలముకున్నాయి. విహారయాత్ర కన్నీటి యాత్రగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పవిత్ర సంగమం వద్దకు శనివారం విహారయాత్ర కోసం వచ్చిన నలుగురు ఇంజినీరింగు విద్యార్థులు ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో గల్లంతయ్యారు. నదిలో శనివారం రాత్రి వరకు గాలించినప్పటికీ విద్యార్థుల ఆచూకీ లభించలేదు. ఈ ఉదయం తిరిగి గాలింపు చేపట్టగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద గతేడాది నవంబర్‌లో బోటు బోల్తాపడి 22 మంది మృత్యువాత పడ్డ విషయం విదితమే. ఇపుడు అదే ప్రాంతంలో నలుగురు విద్యార్థులు గల్లంతుకావడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.