నగరాన్ని ముంచెత్తిన వరుణుడు..

SMTV Desk 2018-06-23 11:31:19  heavy rains in hyderbad, rains in hyderabad, imd, hyderabad

హైదరాబాద్, జూన్ 23 : హైదరాబాద్ నగరం భారీ వర్షంతో అతలాకుతలం అయ్యింది. అర్థరాత్రి నుండి కుండపోతగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. రోడ్ల మీద మోకాలు లోతులో నీళ్లు చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గత అర్థరాత్రి భారీ వర్షం పాతం నమోదైంది. అంబర్‌పేట్‌లో 48 మి.మీటర్లు, నారాయణగూడ 31.8, నాంపల్లి 27.8, ఎల్బీ నగర్‌ 22.5, జాబ్లీహిల్స్‌ 16 మి. మీటర్ల వర్షంపాతం నమోదైయింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజులు అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.