అందరి చూపు..ఆ క్రీడా వైపు..

SMTV Desk 2018-06-22 18:18:58  fifa-2018, fifa world cup 2018, barc council, delhi

ఢిల్లీ, జూన్ 22 : ప్రపంచమంతా ఫుట్‌బాల్‌ ఫీవర్‌ తో ఊగిపోతుంది. దేశదేశాల నుంచి వచ్చిన అభిమానుల సందడితో రష్యా స్టేడియాలన్నీ కళకళలాడుతున్నాయి. అక్కడి దాకా వెళ్లి చూసే అవకాశం లేనివాళ్లు పరోక్ష మార్గాల ద్వారా మ్యాచ్‌లు చూస్తూ ఆనందిస్తున్నారు. ఇక భారత్‌లోనూ ఈ ప్రపంచకప్‌కు భారీగా క్రేజు పెరిగినట్లు తెలిసింది. టీవీ, ఆన్‌లైన్‌లో మ్యాచ్‌లు వీక్షించే అభిమానుల సంఖ్య భారత్‌లో గణనీయంగా పెరిగినట్లు భారత బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) నివేదిక ద్వారా తెలిసింది. దీని ప్రకారం భారత్‌లో కనీసం నిమిషానికి సుమారు 4.7కోట్ల మంది ఈ ప్రపంచకప్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌లు(తొలి రెండు రోజులు) చూసినట్లు తెలిసింది. ఇందులో 45శాతం మంది మహిళలే ఉండటం మరో విశేషం. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఇప్పటివరకూ భారత్‌లో ఏ క్రీడను మహిళలు ఈ స్థాయిలో దృశ్యమాధ్యమాల ద్వారా వీక్షించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫిఫా వరల్డ్‌కప్‌ను భారత్‌లో సోనీ టెన్‌-2, సోనీ టెన్‌-3, సోనీ ఈఎస్‌పీఎన్‌ ఛానళ్లు ప్రత్యక్షప్రసారం చేస్తున్నాయి.