గంటాతో సమావేశమైన చినరాజప్ప..

SMTV Desk 2018-06-21 11:34:45  ganta srinivasa rao, tdp leader ganta, chinarajappa, ap education minister ganta, tdp

విశాఖపట్నం, జూన్ 21 : గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావును బుజ్జగించేందుకు టీడీపీ అధినాయకత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో విభేదాలు, పార్టీ నాయకత్వం తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతో గంటా శ్రీనివాసరావు కొన్ని రోజులుగా పార్టీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాకుండా మంగళవారం సాయంత్రం జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశానికి సైతం దూరంగా ఉండి.. తన అసంతృప్తిని వెల్లడించారు. క్రమంగా చంద్రబాబుకు, టీడీపీకి గంటా శ్రీనివాసరావు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం.. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను రంగంలోకి దింపింది. గురువారం ఉదయం గంటా నివాసానికి చేరుకున్న చిన రాజప్ప.. ఆయనతో సమావేశమై మంతనాలు జరిపారు. ముఖ్యంగా భీమిలిలో చంద్రబాబు పర్యటనకు హాజరుకావాలని, ఆయన నిర్వహించే సభలో పాల్గొనాలని చిన రాజప్ప గంటాను బుజ్జగించినట్టు తెలుస్తోంది. సమావేశం తర్వాత గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల పార్టీ చేసిన సర్వేలో భీమిలిలో గంటాకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని రావడంతో ఆయన మనస్తాపం చెందారని చినరాజప్ప అన్నారు. పనిచేసే మంత్రిపై ఇలాంటి సర్వే రావడం దురదృష్టకరమని.. వచ్చే ఎన్నికల్లో గంటా భీమిలి నుంచి మరోసారి పోటీ చేసి గెలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.