జులైలో అందుబాటులోకి అమీర్‌పేట-ఎల్బీనగర్‌ మెట్రో..

SMTV Desk 2018-06-20 15:41:10  hyderabad metro railway, lb nagar to ameerpet, ktr, hyderabad

హైదరాబాద్‌, జూన్ 20 : రాజధానిలో రవాణారంగ ముఖచిత్రాన్నే మార్చేసిన మెట్రోరైలు సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. నగరంలోని రెండోదశ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను బుధవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ వరకు మొదలైన ట్రయల్‌ రన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. జులై చివరివారంలో అమీర్‌పేట- ఎల్బీనగర్‌ మార్గాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెట్రోతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయని.. మెట్రోతో నాంపల్లి రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్‌ను అనుసంధానం చేస్తున్నామని కేటీఆర్‌ వెల్లడించారు. ఎల్బీనగర్‌- అమీర్‌పేట మధ్యలో ఉన్న చారిత్రక సంపదని ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని ఎల్అండ్‌టీ కంపెనీని కోరామన్నారు. హైటెక్ సిటీ మార్గాన్ని అక్టోబర్‌లో పూర్తి చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. అదే విధంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా సెట్విన్‌ బస్సులను కూడా అనుసంధానం చేస్తామన్నారు. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్‌, ఎంపీ మల్లారెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.