ఫస్ట్ యో యో.. నెక్స్ట్ టీం ఎంపిక..

SMTV Desk 2018-06-19 18:40:22  yo-to test in cricket, india cricket team, bcci, ipl, england

ఢిల్లీ, జూన్ 19 : టీమిండియా క్రికెటర్లకు ఫిట్ నెస్ కోసం బీసీసీఐ యో యో పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్టును జట్టు ఎంపిక ప్రక్రియ ముందే నిర్వహించాలని బీసీసీఐ పాలకుల కమిటీ నిర్ణయించింది. అఫ్గాన్‌తో టెస్టు కోసం బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియాలో మహమ్మద్‌ షమి చోటు దక్కించుకున్నాడు. కానీ, తర్వాత నిర్వహించిన యో యో టెస్టులో అతడు ఫెయిలవ్వడంతో జట్టు నుంచి తప్పించారు. తాజాగా ఇంగ్లాండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన అంబటి రాయుడు, సంజు శాంసన్‌(భారత్‌-ఎ) కూడా యో యో టెస్టులో ఫెయిలవ్వడంతో జట్టులో చోటు కోల్పోయారు. అంబటి రాయుడు స్థానంలో సురేశ్‌ రైనాను తీసుకునట్లు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. అయితే జట్టులో ఎంపిక చేసిన తర్వాత ఆటగాళ్లకు యో యో పరీక్ష నిర్వహించి.. ఫెయిలైన వారిని తప్పించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ పాలకుల కమిటీ సమావేశం నిర్వహించింది. ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌, డయానా ఎడుల్జి, బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి, బీసీసీఐ జనరల్‌ మేనేజర్ సబా కరీం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఇక నుంచి ఆటగాళ్లకు యో యో టెస్టు నిర్వహించిన తర్వాతే జట్టు ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. "అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు, ఇంగ్లాండ్‌ పర్యటన కోసం బీసీసీఐ ఆటగాళ్లకు యో యో టెస్టు నిర్వహించకుండానే జట్టు సభ్యుల పేర్లను ప్రకటించాల్సి వచ్చింది. అనంతరం షమి, అంబటి రాయుడు యో యో టెస్టులో విఫలమయ్యారు. ఐపీఎల్‌ జరిగే సమయంలో ఈ జట్లను వెల్లడించం. ఐపీఎల్‌తో ఆటగాళ్లు బిజీగా ఉండటంతోనే ముందు జట్టుకు ఎంపిక చేసి ఆ తర్వాత యో యో పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. ఇలా మరోసారి జరగదు" అని జోహ్రి వ్యాఖ్యానించారు.