సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా

SMTV Desk 2018-06-19 16:01:06  Mehbooba Mufti, pdp vs bjp, Mehbooba Mufti resign, jammu kashmir

జమ్మూ కాశ్మీర్, జూన్ 19 : జమ్ము-కశ్మీర్‌లో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ ( పీడీపీతో) పొత్తుకు బీజేపీ గుడ్ బై చెప్పింది. బీజేపీ నిర్ణయంతో మూడేళ్ల సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడింది. దీంతో సంఖ్యాబలం కోల్పోయిన ముఫ్తీ తన రాజీనామాను గవర్నర్‌ ఎన్.ఎన్.వోహ్రాకు పంపారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ కశ్మీర్‌ ఇన్‌ఛార్జ్‌ రాం మాధవ్‌ ఇక పీడీపీతో కలిసి ప్రభుత్వంలో కొనసాగలేమని, తమ మంత్రులను ఉప సంహరించుకుంటున్నామని చెప్పారు. "కాశ్మీర్‌లో ఉగ్రవాదం పెరుగుతోంది. శాంతి భద్రతలు కరువయ్యాయి. ఇంకా చెప్పాలంటే పత్రికా స్వేచ్ఛకు, వాక్ స్వాతంత్ర్యానికి ప్రమాదం వాటిల్లింది. పట్టపగలే జర్నలిస్ట్ బుఖారిని ఉగ్రవాదులు హత్య చేశారు. ఉగ్రవాదులను నియంత్రించేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేసింది" అని బీజేపీ నేత రాం మాధవ్‌ వివరించారు. పరిస్థితిని సమీక్షిచేందుకు మెహబూబా ముఫ్తీ తన నివాసంలో 4 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడంతో పీడీపీ నేతలంతా అక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు, బీజేపీ మంత్రులంతా తమ రాజీనామాలను గవర్నర్‌కు సమర్పించారు. కాల్పుల విరమణ ఒప్పందంపై మిత్రపక్షాలు బీజేపీ-పీడీపీల మధ్య విభేదాలు కీలక పరిణామాలకు దారితీశాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలని పీడీపీ పట్టుపట్టగా, బీజేపీ అందుకు అంగీకరించలేదు.