పరకాల ప్రభాకర్ రాజీనామా.. ప్రభావం ఎవరిదీ..!

SMTV Desk 2018-06-19 15:15:47  parakala prabhakar resignation, ap govt advisor, amaravathi, parakala prabhakar

అమరావతి, జూన్ 19 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపించారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని ఆయన పేర్కొన్నారు. కొన్ని రోజులుగా కొందరు తనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని పరకాల లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. 2014 ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టిన అధికార టీడీపీ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో పొత్తుకు బై..బై చెప్పేసింది. అప్పటి నుండి ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. అంతే కాకుండా పరకాల ప్రభాకర్‌ భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాల కూడా ఈ ధోరణిపై మండిపడుతున్నాయి. అంతే కాకుండా చంద్రబాబుకు పరకాలకు మధ్య సంబంధాలు అంతగా లేవని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ నేత జగన్‌ నిన్న ప్రజసంకల్పయాత్రలో.. మాట్లాడుతూ ఇక్కడ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు చంద్రబాబు నాటకం ఆడుతున్నారని అన్నారు. పైకేమో బీజేపీని తిడతారని.. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ను తన పక్కనే పెట్టుకుంటారని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు పరకాల పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షం అంటే సాధారణంగా విమర్శలు చేస్తుందని, అంతా మాత్రానికే రాజీనామా తగదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.