కేంద్రం వైఖరిని ఎండగట్టిన చంద్రబాబు‌..

SMTV Desk 2018-06-17 14:12:54  chandrababu naidu, neethi ayog, pm modi.

ఢిల్లీ, జూన్ 17 : ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం చిన్న చూపు చూడటం సరికాదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశంలో నిలదీశారు. అక్షర క్రమంలో ముందుగా మాట్లాడే అవకాశం లభించిన చంద్రబాబు దాదాపు 20 నిమిషాల పాటు ఏపీలో ఉన్న సమస్యలను కేంద్రానికి వివరించారు. ఆదాయంలో ఏపీ సేవారంగం వృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరిగిందని.. విభజన చట్టంలోని అంశాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. నాలుగేళ్లలో ఏపీ సొంతంగానే ఎదుగుతూ వచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కావాల్సిన నిధులు సమకూర్చాలని.. పోలవరం భూసేకరణ, పునరావస కల్పనకు కావాల్సిన నిధులను కోరారు. రాష్ట్రానికి రైల్వే జోన్‌ ఇస్తామని హామీ ఇచ్చి నేటికి నెరవేర్చలేద౦టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకూ రాష్ట్రానికి చేయూత నివ్వాలని కోరుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో నీతి ఆయోగ్‌ పాలకమండలి నాలుగో సమావేశం జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.