హస్తినకు పయనమైన ఏపీ సీఎం..

SMTV Desk 2018-06-16 16:42:06  ap cm chandrababu naidu, niti aayog meet, finance minister yanamala, amaravathi

అమరావతి, జూన్ 16 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు నీతిఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం ఢిల్లీ పయనమయ్యారు. చంద్రబాబు వెంట ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామృష్ణుడు కూడా వెళుతున్నారు. రేపటి సమావేశం కోసం 24 పేజీల సమగ్రనివేదికను సీఎం సిద్ధం చేశారు. జీఎస్టీ వల్ల జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలని ఆయన నిర్ణయించుకున్నారు. 15వ ఆర్థిక సంఘ విధివిధానాల అమలుకు పట్టుబట్టనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించే అవకాశం ఇవ్వకుంటే నిరసన తెలిపే అవకాశం ఉందని యనమల తెలిపారు. ఆయా రాష్ట్రాలకు సమస్యలు తెలిపే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రధాని, అన్ని రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం ఆదివారం (17న) ఢిల్లీలో జరగనుంది. ప్రధాని మోదీ దీనికి అధ్యక్షత వహించనున్నారు. దీనికి చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. ఎన్డీఏతో టీడీపీ తెగతెంపుల తర్వాత వీరిద్దరూ ఎదురుపడనుండడం ఇదే తొలిసారి. అక్షర క్రమం ప్రకారం ఈ సమావేశానికి వచ్చే ముఖ్యమంత్రుల్లో మాట్లాడే తొలి అవకాశం ఆంధ్ర సీఎంకే వస్తుందని అంచనా. ఈ అవకాశాన్ని వినియోగించుకుని తన అభిప్రాయాలను చంద్రబాబు బలంగా వినిపించనున్నారు.