నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఈపీఎస్, ఓపీఎస్..

SMTV Desk 2018-06-16 13:37:11  eps-ops meet modi, eps-ops aiadmk meets modi, niti aayog, delhi

చెన్నై, జూన్ 16 : తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌), డిప్యూటీ సీఎంఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ ఇద్దరూ ఏకమైన తర్వాత మొదటిసారిగా కలిసి ఢిల్లీ వెళ్లడంతో పాటు తొలిసారిగా ప్రధానితో భేటీ కానున్నారు. దీంతో సహజంగానే ఈ పర్యటన పట్ల రాష్ట్ర రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత నెలకొంది. నాలుగో వార్షిక నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు ఈ ఇద్దరూ వెళ్లనున్నప్పటికీ, అంతకంటే ప్రధానితో ఈ ఇద్దరి భేటీకే ఎనలేని ప్రాముఖ్యత సంతరించుకుంది. మోదీ జోక్యంతోనే ఓపీఎ్‌సను ఈపీఎస్‌ దరిచేర్చుకున్నారు. అన్నాడీఎంకేలోకి ఓపీఎస్ ను చేర్చుకోవడంతో పాటు ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఆర్థికశాఖ కట్టబెట్టారు. మోదీ ఆదేశాల మేరకే ఇరువర్గాలు సమన్వయంతో కలసి నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఆదివారం ఢిల్లీలో మోదీతో భేటీ కానున్నారు. కావేరీ నిర్వహణా బోర్డు ఏర్పాటు, దాని నిర్వహణా తీరుపైనా, తూత్తుకుడి ఘటనపైనా వీరు మోదీకి వివరణ ఇవ్వనున్నారు. పోలీసు తూటాలకు 13 మంది బలైనా ఇప్పటి వరకూ ప్రధాని కనీసం సంతానం ప్రకటించలేదు. దీంతో ఆయన స్టెరిలైట్‌ కర్మాగారం కొనసాగింపుకే కట్టుబడి వున్నారని ప్రచారం జరుగుతోంది. నిజానికి స్టెరిలైట్‌ వ్యతిరేక ఆందోళనకారుల పట్ల ప్రధాని గుర్రుగా వున్నారని కూడా అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల అక్కడ ఆ స్థితికి గల కారణాలపై ఈపీఎస్‌, ఓపీఎస్‌ వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. అంతే కాకుండా ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు వ్యవహారంపైనా ప్రధానితో చర్చించనున్నట్లు అన్నాడీఎంకే విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో ఎలాంటి తీర్పు వచ్చినా ఎడప్పాడికి పదవీగండం తప్పదని సంకేతాలు వెలువడుతున్నాయి.