క్రీడాస్ఫూర్తి అంటే ఏంటో చూపించిన భారత్..

SMTV Desk 2018-06-16 12:05:09  Ajinkya Rahane, Commendable Gesture For, india vs afghanistan, rahane

బెంగళూరు, జూన్ 16 : చారిత్రక టెస్టును తొందరగా ముగించి చారిత్రాత్మక విజయం సాధించిన టీమిండియా ప్రత్యర్థిని గౌరవించి క్రీడాస్ఫూర్తిలోనూ గెలిచింది. అరంగేట్ర టెస్టులో భారత బౌలర్ల ధాటికి అఫ్గానిస్థాన్‌ 262 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఐదు రోజుల పాటు సాగాల్సిన టెస్టు మ్యాచ్‌ కాస్త కేవలం రెండు రోజులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 109పరుగులకే చాప చుట్టేసిన ఈ పసికూన జట్టు, ఫాలోఆన్‌లోనూ 103పరుగులకే ఆలౌటైంది. ఏకైక టెస్టులో విజయానంతరం ట్రోఫీని అందుకున్న భారత్ కెప్టెన్‌ రహానే తర్వాత టీమిండియా సహచరులతో కలిసి ఫొటోకు ఫోజిచ్చాడు. అనంతరం ప్రత్యర్థి ఆటగాళ్లైన అఫ్గాన్‌ ఆటగాళ్లను సాదరంగా ఆహ్వానించి ట్రోఫీతో ఉమ్మడిగా ఫొటో దిగారు. అయితే భారత ఆటగాళ్లు కనబర్చిన క్రీడాస్తూర్తిని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం కొనియాడుతోంది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. ‘అందరూ కలసి ట్రోఫీతో పొజిద్దామని ప్రత్యర్థి ఆటగాళ్లను పిలవడం.. ఇది మరో టెస్ట్‌ ఆడటం కన్నా ఎక్కువ అంటూ.. క్రీడాస్ఫూర్తికి ఇదో గొప్ప నిదర్శనమంటూ’ బీసీసీఐ తెలిపింది. అయితే టీం ఇండియా క్రీడాస్ఫూర్తిని చూసి క్రికెట్‌ ప్రపంచమంతా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ దృశ్యం తమ మనసులను హత్తుకుందని, భారత్‌-అఫ్గాన్‌ స్నేహం ఇలానే ఉండాలని, ఇరు జట్లు అన్నదమ్ములని, భవిష్యత్తులో అఫ్గాన్‌ బాగా రాణించాలని అభిమానులు కామెంట్‌ చేశారు. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి..