భర్త వేధింపులకు వివాహిత బలి..!

SMTV Desk 2018-06-15 17:27:31  vishkhapatnam, vishakapatnam suicide issue, softwere suicide, andhrapradesh

విశాఖపట్నం, జూన్ 15 : ఉన్నత చదువులు చదివి.. ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం సాధించి ...రూ.లక్షల్లో వేతనం తీసుకుంటున్న వివాహిత జీవితం మధ్యలోనే ముగిసిపోయింది. సాఫీగా సాగిపోవాల్సిన జీవితంలో అత్తింటి వారి వేధింపులు ఆమెను మానసికంగా కుంగుబాటుకు కారణమయ్యాయి. దీంతో తట్టుకోలేని ఆమె ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాలివి..నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన పీతల అప్పారావు ఆంధ్రా యూనివర్సిటీలో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో రెండో కుమార్తె వాణి(35)కి 2011లో జిల్లా పరిషత్‌ దరి కృష్ణానగర్‌కు చెందిన పసుపులేటి బుల్లయ్య కుమారుడు గంగాధర్‌తో వివాహం జరిగింది. వివాహం సమయంలో అధిక మొత్తంలో కట్న, లాంఛనాలు సమర్పించారు. తరువాత భార్యాభర్తలిద్దరూ అమెరికా వెళ్లి అక్కడ ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగాలు చేశారు. వీరికి ఆరేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. వాణికి రూ.7.8 లక్షలు జీతం కాగా గంగాధర్‌ జీతం రూ.నాలుగు లక్షలు. . దీంతో భర్త గంగాధర్‌లో అసూయ బాగా పెరిగిపోయింది. అమెరికాలో ఉండగానే వాణికి భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఇంకా కట్నం, కానుకలు తేవాలని సూటిపోటి మాటలతో వేధించాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేయాలని కూడా ఒత్తిడి తెచ్చాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ ఈ ఏడాది ఏప్రిల్‌ 29న విశాఖ వచ్చేశారు. వాణి ఇద్దరు పిల్లలతో పుట్టింట్లో ఉంటుండగా, గంగాధర్‌ తన తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ఇదిలాఉండగా గంగాధర్‌ పిల్లలను తన వద్దకు రప్పించుకున్నాడు. కాగా..గంగాధర్‌ తన చిన్న కుమారుడికి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం వాణి తల్లిదండ్రులు ఆమెను నిద్రలేపడానికి ఎన్నిసార్లు గది తలుపుకొట్టినా.. స్పందన లేకపోవడంతో ఆందోళన చెందారు. తలుపు తెరిచి చూసేసరికి వాణి విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం చూసి కుప్పకూలిపోయారు. వారిని ఓదార్చ డం ఎవరి తరమూ కాలేదు. మూడో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. కేసును ఎస్‌ఐ ప్రసాద్‌ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.