ఫిఫా వరల్డ్ కప్ : బోణీ ఆతిథ్య జట్టుదే..

SMTV Desk 2018-06-15 11:58:02  #fifa world cup-2018, Russia 5-0 Saudi Arabia, fifa, russia

రష్యా, జూన్ 15 : ఫిఫా వరల్డ్ కప్-2018 ఆతిధ్య జట్టు రష్యా బోణీ కొట్టింది. ఫిఫా ప్రపంచ కప్‌నకు ఆతిథ్య జట్టుగా తనవంతు అదిరే ఆరంభం అందించింది. సొంతగడ్డపై, సొంత ప్రేక్షకుల మధ్య చెలరేగిపోయి..తిరుగులేని ఆధిపత్యంతో గోల్స్‌ వర్షం కురిపిస్తూ 5-0తో సౌదీ అరేబియాను చిత్తు చిత్తుగా ఓడించింది. బంతిని ఎక్కువ సమయం ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ సౌదీ జట్టు ఒక్క గోల్‌ కూడా చేయలేక పోయింది. రష్యా ఆటగాళ్లలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ చెరిషెవ్‌ రెండు, గాజిన్‌ స్కీ, అలెగ్జాండర్‌ గొలొవిన్, డియుబా తలా ఒక గోల్‌తో ప్రత్యర్థిని కోలుకోనీయకుండా చేశారు. చెరిషెవ్, డియుబాలు సబ్‌స్టిట్యూట్‌లుగా వచ్చి గోల్స్‌ కొట్టడం విశేషం. మ్యాచ్ ఆరంభానికి ముందు ఫుట్‌బాల్‌ ఆకారంలో తీర్చిదిద్దిన మైదానంలో అరగంట పాటు వేడుకలు నిర్వహించారు. 32 జట్ల తరఫున ఇద్దరేసి చొప్పున ప్రతినిధులు ఆయా దేశాల దుస్తుల్లో స్టేడియంలోకి వచ్చారు. వారిలో కొందరు నృత్యాలు చేశారు. అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రసంగం మొదలైంది. ప్రపంచకప్‌ మొదలైనట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.