ఎన్‌ఆర్‌ఐ భర్తలకు సర్కార్‌ షాక్‌..

SMTV Desk 2018-06-14 20:52:01  NRI Marriages, Ministry of Women and Child Development , nri marriges act, new delhi

న్యూఢిల్లీ, జూన్ 14 : విలాసవంతమైన జీవనశైలితో ఆకట్టుకుని పెళ్లి చేసుకున్న తర్వాత భార్యలను వదిలివేస్తున్న ఎన్‌ఆర్‌ఐ భర్తలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. కోర్టు సమన్లను లెక్కచేయని ఎన్‌ఆర్‌ఐ భర్తల ఉమ్మడి ఆస్తిలో వాటాను సీజ్‌ చేస్తూ చట్ట సవరణలు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని సమాచారం. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యలను వదిలివేస్తున్న ఎన్‌ఆర్‌ఐ భర్తల ఉదంతాలు పెరుగుతున్న క్రమంలో వీరికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. భార్యలను మోసం చేసి తప్పించుకుతిరిగే ఎన్‌ఆర్‌ఐలను చట్టం ముందు దోషిగా నిలిపేందుకు చట్ట సవరణలను సత్వరమే చేపట్టాలని సుష్మా స్వరాజ్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, మనేకా గాంధీ వంటి సీనియర్‌ మంత్రులతో కూడిన మంత్రుల బృందం నిర్ణయించింది. జీవిత భాగస్వామి దాఖలు చేసిన ఫిర్యాదుపై పోలీసుల విచారకు, సమన్లకు స్పందించకుండా దేశ విదేశాల్లో తిరుగుతూ, గుర్తింపును సైతం మార్చుకుంటూ న్యాయప్రక్రియను ఎదుర్కోని వారి పేర్లను వెబ్‌సైట్‌లో​పొందుపరచాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. వారిని పరారీలో ఉన్నట్టు ప్రకటించడంతో పాటు వారి ఆస్తుల స్వాధీనం, పాస్‌పోర్టుల రద్దు వంటి తీవ్ర చర్యలూ చేపట్టాలని యోచిస్తోంది. మరోవైపు ఇటీవల ప్రకటించిన వివాహమైన 48 గంటల్లోగా ఎన్‌ఆర్‌ఐ వివాహాలను విధిగా రిజిస్టర్‌ చేయించాలన్న నిబంధనను సత్వర అమలుకు ప్రభుత్వం పావులు కదుపుతుంది.