లష్కరేనే అన్నింటికీ సూత్రదారి

SMTV Desk 2017-07-12 16:37:29  JAMMU KASHMEER, LASHKARE THOIBA, AMARNAATH YAATRAA, POLICE, ISMAIEL, TERRARISTS, RAAMNATH SINGH

శ్రీనగర్‌ జూలై 12 : జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదుల కోసం భద్రతదళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇది లష్కరే తొయిబాల పనేనని కశ్మీర్‌ ఐజీ అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు. పాకిస్థాన్‌ ఉగ్రవాది అబూ ఇస్మాయిల్‌ కనుసన్నల్లోనే ఈ ఘాతుకం జరిగిందని, 5 నుంచి ఆరుగురు ఉగ్రవాదులు పాల్గొని ఉంటారని తెలిపారు. లష్కరే కు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులు సాయపడినట్లు అనుమానిస్తున్నారు. దీన్ని లష్కరే తొయిబా ఖండించింది. ఇస్లాం ఏమతాన్నీ లక్ష్యంగా చేసుకొని హింసకు పాల్పడటాన్ని అంగీకరించదని పేర్కొంది. వెంట వెంటనే రెండుసార్లు దాడి... సోమవారం అనంత్‌నాగ్‌ జిల్లాలోని సంగం అనే ప్రాంతంలో యాత్రికుల బస్సు టైర్ పాడవడంతో గంట వరకు ఆలస్యమైంది. బస్సు తిరిగి ప్రయాణమై రాత్రి 8.17 గంటలకు ఖానాబల్‌ వద్దకు చేరుకోగానే ఒక ముఠా కాల్పులు జరిపింది. బస్సు డ్రైవర్‌ సలీమ్‌ షేక్‌ వాహనాన్ని ముందుకు ఉరికిస్తూ, 75 మీటర్లు మేర ప్రయాణించగానే మరో ముఠా విరుచుకుపడింది. అమర్‌నాథ్‌ యాత్రికులపై వెంట వెంటనే రెండుసార్లు దాడి జరిగిందని, ఆటోమేటిక్‌ తుపాకులతో తూటాల వర్షం కురిపించారని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు రెండు పేజీల నివేదికను పంపింది. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులు.. గాయపడ్డ యాత్రికులను అనంత్‌నాగ్‌ పోలీసు లైన్‌ వద్దకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. అసలు ఎలా అనుమతించారు! రహదారి భద్రతా బృందాన్ని ఉపసంహరించాక యాత్రికుల బస్సును రోడ్డుపైకి ఎలా అనుమతించారన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ బస్సును ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోలేదని ఆ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్‌ పోలీసులపై వారు విరుచుకుపడ్డారని సీనియర్‌ పోలీసు అధికారులు చెప్పారు. ఇస్మాయిల్‌ ఎవరు? కరడుగట్టిన ఉగ్రవాది అబు దుజానాకు వారసుడిగా భావిస్తున్న అబు ఇస్మాయిల్‌, పాకిస్థాన్‌ జాతీయుడు. కశ్మీర్‌లో లష్కరే అధినాయకుడు. ఈ అమానుష దాడికి సూత్రధారిగా భావిస్తున్న ఇస్మాయిల్‌కు స్థానిక ఉగ్రవాదులు సాయం చేసినట్లు స్థానిక పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ దాడి సమయంలో ఇస్మాయిల్‌, అతడి వెంట మరో ఇద్దరు ముష్కరులు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఉగ్రవాదులను ఘటనా స్థలానికి చేర్చి ఆయుధాలను అందించిన వారిని కూడా గుర్తించాం త్వరలోనే వారిని పట్టుకుంటామని ఓ అధికారి వెల్లడించారు. దక్షిణ కశ్మీర్‌లో ఈ ముఠా కింద 30 మంది ఉగ్రవాదులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది స్థానికులే. ఉత్తర కశ్మీర్‌లో 80మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పాక్‌ జాతీయులు ఉన్నారు. వీరంతా అజ్ఞాతంలో ఉంటారు. తొలిసారిగా లష్కరేకు స్థానిక హిజ్బుల్‌ ముజాహిదీన్‌ క్యాడర్‌ తోడ్పాటు అందింది. అమర్‌నాథ్‌ యాత్రికులపై ఇప్పటివరకూ ఐదుసార్లు దాడులు జరగగా.. అన్నింటికీ సూత్రధారి లష్కరే తొయిబానే. హిజ్బుల్‌ మాత్రం లౌకికవాదం అనే ముసుగును ధరించి, అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడి చేయరాదన్న విధానాన్ని పాటిస్తోంది. రాజ్ నాథ్ ఆదేశం : యాత్రికుల భద్రత ఇంకా పెంచాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదేశించారు. ఆయన జమ్మూ కశ్మీర్ పరిస్థితులపై అధికారులతో దాదాపు గంటసేపు చర్చించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల అంతు చూడాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు. అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడి గురించి ఆన్‌లైన్‌లో వచ్చిన విమర్శల్ని రాజ్‌నాథ్‌ తిప్పికొట్టారు. కశ్మీరీలంతా ఉగ్రవాదులు కారనీ, దేశంలో అన్ని ప్రాంతాల్లో శాంతి-సౌభ్రాతృత్వాలను పరిరక్షించడం తన విధి అని తెలిపారు. హోంమంత్రి సమీక్ష సమావేశం ముగియగానే ఆ చర్చల సారాంశాన్ని ప్రధాని నరేంద్రమోదీకి డోభాల్‌ వివరించారు. అదనపు భద్రత చర్యల్ని నివేదించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ ఆహిర్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కేంద్ర బృందం జమ్ముకశ్మీర్‌కు వెళ్లింది. కేంద్ర బలగాల మోహరింపుపై సమీక్ష నిమిత్తం కేంద్ర రిజర్వ్‌ పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఆర్‌.భట్నాగర్‌ ఇప్పటికే శ్రీనగర్‌ చేరుకున్నారు. భారత సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ దాడి ఘటనను ఖండిస్తూ.. ఉగ్రవాదులపై ఒత్తిడి పెంచేలా కార్యకలాపాలు ముమ్మరం చేయండని సైనిక బలగాలను ఆదేశించారు. జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతోనూ ఆయన చర్చించారు. ఆగస్టు 7వ తేదీ వరకు కొనసాగే యాత్ర ప్రశాంతంగా ముగిసేలా భద్రతపరమైన సమీక్షను బలగాలు నిర్వహించనున్నాయి. ఉగ్రవాదుల్ని పరుగులు తీయించేలా ప్రత్యేక దాడులకూ రంగం సిద్ధమవుతోంది. లఖన్‌పూర్‌ నుంచి పవిత్ర గుహ వరకు 90 వేల మంది బలగాలను మోహరించనున్నారు.