వివేక్ ఎన్నిక చెల్లదు : హైకోర్టు

SMTV Desk 2018-06-12 14:16:12  hca president vivek, former mp vivek, bcci, high court

హైదరాబాద్‌, జూన్ 12 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు వివేక్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. వివేక్ ఎన్నిక చెల్లదంటూ అంబుడ్స్ మెన్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం కొట్టివేసింది. మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించింది. అప్పటి వరకు వివేక్‌ హెచ్‌సీఏ అధ్యక్ష పదవిలో కొనసాగొద్దని తీర్పునిచ్చింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా అజారుద్దీన్‌పై వివేక్ గెలుపొందారు. అయితే వివేక్ ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ హెచ్ సీఏ పదవిలో కొనసాగడం లోధా కమిటీ సిఫార్సులకు, చట్టానికి విరుద్దమంటూ అజారుద్దీన్ అంబుడ్స్ మెన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అంబుడ్స్ మెన్ వివేక్ ఎన్నిక చెల్లదని తేల్చిచెప్పింది. అంబుడ్స్ మెన్ నిర్ణయంతో పదవి కోల్పోయిన వివేక్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి అంబుడ్స్ మెన్ తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వివేక్‌కు ఊరట కలిగింది. అయితే సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ అజారుద్దీన్ ధర్మాసనం ఎదుట అప్పీలు దాఖలు చేశారు. అజారుద్దీన్ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని భారత మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ వెల్లడించారు. వివేక్‌ ప్యానల్‌ ఎంపిక నిబంధనల ప్రకారం జరగలేదని.. అంబడ్స్‌మెన్‌ వివేక్‌పై తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన తెలిపారు. తొలి నుంచి తాము వివేక్‌ ప్యానల్‌పై పోరాటం చేస్తున్నామని, చివరకు హెచ్‌సీఏలో న్యాయమే విజయంసాధించిదని అజార్ వ్యాఖ్యానించారు.